అన్నాకు మద్దతుగా బాబు ధర్నా :సినీ జ్వాల తెలుగు:

Posted on

హైదరాబాద్‌ : సామాజిక కార్యకర్త అన్నా హజారే అరెస్ట్‌ను నిరసిస్తూ, ఆయనకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన సహచరులతో కలిసి సికింద్రాబాద్‌ వద్ద ధర్నా చేపట్టారు. తక్షణమే అన్నాను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. హజారే దీక్షపై విధించిన షరతులను బేషరతుగా తొలగించాలని ఈ సందర్భంగా చంద్రబాబు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ హయాంలో అవినీతి ఆకాశ్నంటిందని ధ్వజమెత్తారు. అవినీతిపై పోరాడేందుకు ముందుకు రావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పటిష్టమైన లోక్‌పాల్‌ బిల్లు కోసం తాము జైలుకైనా వెళ్లడానికి సిద్ధమని ఆయన తెలిపారు. లోక్‌పాల్‌ పరిధిలో ప్రధాని ఉంటే నష్టమేమిటని ఆయన ప్రశ్నించారు. కల్మాడీ ఉన్న బ్యారెక్‌లో హజారేను ఉంచడం అన్యాయమన్నారు. లోక్‌పాల్‌ బిల్లు వచ్చే వరకు తమ ఆందోళన ఆపే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. ప్రధానిని కూడా లోక్‌పాల్‌ బిల్లు పరిధిలోకి తీసుకరావాలన్నదే తమ ప్రధాన డిమాండ్‌ అని ఆయన పేర్కొన్నారు.

కాగా, ధర్నా అనంతరం చంద్రబాబు పాదయాత్ర చేస్తుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా రాంగోపాల్‌పేట పీఎస్‌ ఎదుట ఆందోళన చేశారు. అరెస్ట్‌ అయిన చంద్రబాబును మహంకాళి పీఎస్‌కు తరలించారు. చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలను అరెస్ట్‌ చేసిన పోలీసులు అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై బాబుతో సహా అందరిని విడిచి పెట్టారు.