ఎమ్మార్ కేసులో ఇరుక్కోనున్న కేవిపి, రోష‌య్య? :CineJwala Telugu:

Posted on

ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారం సీనియర్ నాయకుడు,మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, మాజీ ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రరావుల మెడకు కూడా చుట్టుకుంటుందా అన్నప్రశ్న ఉత్పన్నమవుతోంది.అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉందా అన్నది చర్చనీయాంశంగా ఉంది.సిబిఐ ఒక వేళ ప్రశ్నించదలిస్తే,వీరందరిని కూడా విచారణకు పిలవవచ్చని కధనాలు వస్తున్నాయి.ఎమ్మార్ స్కామ్ లో ఈక్విటీ తగ్గించడం, ఆస్తుల విలువను కొందరికి తగ్గించి అమ్మడం లో ఉన్న మతలబు పై ప్రధానంగా విచారణ జరుగుతుంది. అయితే ఈ ఎమ్మార్ వ్యవహారంలో కూడా మంత్రివర్గ ఉప సంఘం ప్రమేయం కూడా ఉంది.రోశయ్య అప్పట్లో ఆర్ధిక శాఖ మంత్రిగా ఉండేవారు. ఆయన నేతృత్వంలో ఉన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎమ్మార్ జాయింట్ వెంచర్ ను మూడు కంపెనీలుగా విడదీయడానికి ఆమోదం తెలిపింది.తద్వారా ఎమ్.ఆర్.లో రాష్ట్ర వాటాను తగ్గించడానికి ఆస్కారం కలిగింది.తెలుగుదేశం ప్రభుత్వం అంతకుముందు ఆయా కంపెనీలకు ఇచ్చిన భూ కేటాయింపులను మొత్తం రోశయ్య ఆధ్వర్యంలోకి కమిటీ సమీక్షించి క్లియర్ చేసింది.అప్పట్లో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న కెవిపి రామచంద్రరావు భార్యకు, అలాగే వియ్యంకుడు కె.రఘురామరాజుకు ఇందులో విల్లాలు ఉన్నాయి.అలాగే కెవిపికి ఎపిఐఐసి తరపున ఎమ్మార్ లో డైరెక్టర్ గా ఉన్న పార్ధసారధికి, కెవిపికి ఉన్న సంబంధ బాంధవ్యాలపై కూడా ప్రశ్నించవచ్చు. కెవిపికి ఈయన బావమరిది అవుతారు.అలాగే ఎపిఐఐసి ఎమ్.డి గా ఉన్న ఐఎఎస్ అధికారి బి.పి.ఆచార్య ను కూడా ఈ అంశాలపై విచారణకు పిలిచే అవకాశం ఉంది. విధాన పరమైన నిర్ణయాలకు సంబంధించి విచారణ జరపదలిస్తే రోశయ్య, కెవిపిలను ప్రశ్నించవచ్చు. అలాగే చంద్రభాబు హయాంలో తొలి జిఓ విడుదల అయింది కనుక దానిపై కూడా మరిన్ని వివరాలు సేకరించదలిస్తే ఆయనను కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అలాగే ప్లాట్లు, విల్లాల కొనుగోలు లావాదేవీలపై అనుమానాలు వస్తే మంత్రి గీతారెడ్డి, డి.శ్రీనివాస్ వంటివారిని కూడా విచారించవచ్చు. మొత్తం మీద మన రాష్ట్రంలో ఈ తరహా వ్యవహారం ఇదే మొదటిదని చెప్పాలి.