నగరం నిద్రపోతున్న వేళ సినిమా నిర్మాత అరెస్ట్ :CineJwala Telugu:

Posted on

అమాయక ప్రజలను కోట్ల రూపాయల్లో మోసగించి టాలీవుడ్‌లో పెట్టుబడులు పెట్టి సినిమాలు తీస్తున్న వర్ధమాన నిర్మాత నంది శ్రీహరితో పాటు మరో ఇద్దర్ని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలను పోలీసు కమిషనర్‌ ఎ.కె.ఖాన్‌ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన నగరం నిద్రపోతున్న వేళ సినీ నిర్మాత నంది శ్రీహరి తన మిత్రులైన టి.ముక్తిరాజ్‌ బి. బాబురావులతో కలిసి హబ్సిగూడ ప్రాంతంలో గురుదేవ ఇఫ్రా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. నగర శివారు ప్రాంతాల్లో తక్కువ మొత్తానికి ఎకరాల కొద్ది స్థలాన్ని కొనుగోలు చేసి ప్లాట్లను చేసి రియల్‌ వ్యాపారంతో పాటు మనీ సర్క్యులేషన్‌ స్కీంను ఏర్పాటు చేసి దాని ద్వార కూడ మోసాలకు పాల్పడుతున్నారు. నగరంతోపాటు ఇతర ప్రాంతాల్లోను తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ 38వేల 5 వందల మంది సభ్యుల్ని చేర్పించి వారి నుండి 132 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అందులో 90 కోట్లు కమీషన్‌గా చెల్లించాడు. పట్టుబడ్డ వీరినుండి 11 లక్షల నగదుతో పాటు బ్యాంకులో ఉన్న 1 కోటి 90 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే తమ కార్యాలయాన్ని మూసివేసే ప్రయత్నంలో ఉండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సమాచారం అందుకుని నిర్మాతతో పాటు అతని మిత్రులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీహరి అతని మిత్రులు గతంలో పలు వ్యాపారాలు చేసి నష్టపోవడంతో రియల్‌ ఎస్టేట్‌ ముసుగులో తాజా చీటింగ్‌కు తెరలేపారు.