హైదరాబాద్: కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నాయకుడు కె.కేశవరావుకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల దీక్ష శిబిరానికి సంఘీభావం తెలిపేందుకు ఆయన విద్యుత్ సౌధాకు వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగులు ఆయనను నిలదీశారు. మేం ఉద్యమం చేస్తుంటే మీరు ఎసి రూముల్లో ఉంటారా అని వారు కేశవరావును నిలదీశారు. ఉద్యమం కోసం మీరు ఏం చేస్తున్నారంటూ వారు ఆయనను నిలదీశారు.తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో తాము వెనక్కి తగ్దేది లేదని కేశవరావు చెప్పారు. తెలంగాణ సమ్మె వాయిదా పడినా తెలంగాణ కోసం తమ ఉద్యమం ఆగదని ఆయన అన్నారు. రాజీనామాలు చేసిన మంత్రులు, శాసనసభ్యులు ఎట్టి పరిస్థితిలోనూ వెనక్కి తగ్దకూడదని ఆయన సూచించారు. తమపై కేసులు పెడితే భయపడేది లేదని ఆయన అన్నారు. కేసుల నమోదు విషయంలో ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, డిజిపి దినేష్ రెడ్డిని ఆయన తప్పు పట్టారు. ఉద్యమాన్ని రాజకీయ నాయకులు ముందుకు తీసుకుని వెళ్తారని ఆయన అన్నారు.