కెసిఆర్‌పై ద్వజమెత్తిన మోత్కుపల్లి :సినీ జ్వాల తెలుగు:

Posted on

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు టెండర్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నేత మోత్కుపల్లి నర్సింహులు ద్వజమెత్తారు  పోలవరం టెండర్ రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాయడం ద్వారా చేతులు దులుపుకోవాలని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం తెలంగాణ ఫోరం సమావేశానంతరం ఆయన  మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కెసిఆర్ ఆలోచన మేరకే లక్ష్మీరాజ్యానికి చెందిన షూ కంపెనీకి టెండర్ ఇచ్చారని ఆయన అన్నారు. లక్ష్మీరాజ్యం కెసిఆర్ పత్రిక నమస్తే తెలంగాణలో భాగస్వామి అవునా, కాదా అని ఆయన ప్రశ్నించారు. పోలవరం టెండర్‌కు సంబంధించిన ఫైళ్లను శాసనసభ స్పీకర్ వద్ద పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, కెసిఆర్ కుమ్మక్కయి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ కొట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు.కెసిఆర్ ఉద్యమం పేరుతో కోట్లు దండుకుంటున్నారని, ప్రజలకు మాత్రం కన్నీళ్లు మిగిలిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. నమస్తే తెలంగాణ పత్రికలో అవినీతి సొమ్మును పెట్టారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.

నమస్తే తెలంగాణ పత్రికలో తెలంగాణ, సీమాంధ్ర నేతల అవినీతి సొమ్ము పెట్టుబడిగా ఉందని ఆయన అన్నారు. పోలవరం టెండర్‌ను రద్దు చేస్తే సరిపోదని, ఆ వ్యవహారంపై విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడినవారిని శిక్షించాలని ఆయన అన్నారు.తెలంగాణ కోసం వచ్చే నెల 1వ తేదీన ఢిల్లీలో స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ తలపెట్టిన దీక్షకు ఆయన మద్దతు ప్రకటించారు. ఇందుకు గాను తాము వచ్చే నెల 1వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి తెలంగాణపై జిల్లాలవారీగా సదస్సులు నిర్వహిస్తామని, రంగారెడ్డి జిల్లా సదస్సుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఈ సదస్సుల ద్వారా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. తెలంగాణకు మద్దతుగా తాము ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చామని, దానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. ఈ విషయంలో తమపై తప్పుడు ప్రచారం సాగుతోందని, దీన్ని తిప్పికొట్టాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.కాగా, పోలవరం ప్రాజెక్టు టెండర్‌ వ్యవహారంపై విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డితో పాటు మరికొంత మంది తెలుగుదేశం తెలంగాణ నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి కోరారు.అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకునే వరకు తాము ఆందోళన సాగిస్తామని ఆయన చెప్పారు.