పబ్లిసిటీ ఎక్కువ, పస తక్కువ :CineJwala Telugu:

Posted on

ఏ పరిశ్రమలోనైనా ఒక సీజన్‌ అంటూ ఉంటుంది. దీనికి సినిమా పరిశ్రమ అతీతమేమీ కాదు. ఉదాహరణకు రాయలసీమ ఫ్యాక్షన్‌ కథాంశాలకు హీరో వెంకటేష్‌ నటించిన 'ప్రేమించుకుందాం రా..' నాంది పలికింది. ఆ తర్వాత నటుడు బాలకృష్ణ దీన్నే ఫాలో అయ్యారు. ఓ దశలో చిరంజీవి సైతం ఫ్యాక్షన్‌ కథాంశంతో ఓ సినిమా తీయాల్సిందేనన్న పట్టుదలతో వెళ్లారు. 'ఇంద్ర'కు రూపకల్పన చేశారు. ఇక దీని తర్వాత ఫ్యాక్షన్‌ కథాంశాలంటే ప్రేక్షకులకి మొహం మొత్తింది. ఈ దశలో ఫ్యాక్షన్‌ కథాంశాలకు కామెడీ జోడించారు. సినిమా ఆసాంతం ఎంటర్‌టైన్‌ చేస్తూ ఫ్లాష్‌బ్యాక్‌లోనో ఇంటర్వెల్‌ తర్వాతో ఈ ఫ్యాక్షన్‌ ఎపిసోడ్‌ చూపించేవారు. ఇప్పుడు ఈ దశ కూడా దాటిపోయింది. నిర్మాణానికి ముందు పబ్లిసిటీ హైపు జాస్తి అయి క్వాలిటీ లేక చతికిలబడుతున్నాయి. భారీ చిత్రాలతోపాటు చిన్న చిత్రాల పరిస్థితి అలానే ఉంది. పెద్ద చిత్రాల అలజడి లేకపోతే చిన్న సినిమా ఆడటానికి అవకాశం చిక్కినట్టే. కానీ ఇందులోనూ బలమైనవి రావటం లేదు. మరోవైపు ఇంటిల్లిపాదీ థియేరట్‌కు రావటం ఆర్థికంగా బాగా ఖర్చుతో కూడిన వ్యవహారమై పోయింది. ఎలాగూ ఇంట్లో ఉన్న బుల్లితెరలో కావాల్సినన్ని ప్రోగ్రామ్స్‌ వస్తున్నాయి. అంతేగాక పలు హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాలు కూడా తెలుగులో అనువాదమై వస్తున్నాయి. ఇక ఇంతకంటే మన తెలుగు సినిమా చూపించేదేముంది ! అన్న ప్రశ్న సామాన్య ప్రేక్షకుడిలో మొలకెత్తుతోంది.