గాడిదలకు గడ్డివేసి ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు తెలంగాణ కోసం ప్రజలు మరోసారి రాజీనామా కోరితే చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. గురువారం చెన్నూరులో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగసభలో ప్రసంగించారు. తెలంగాణ వాదులతో కార్యకర్తలతో చెన్నూరు పూర్తిగా గులాబిమయంగా మారింది. తెలంగాణ కోసం ప్రాణమున్నంత వరకు కొట్లాడుతాగాని ఉద్యమాన్ని తాకట్టు పెట్టే ద్రోహం చేయనని తెలిపారు. ఉప ఎన్నికల్లో మంచిర్యాల చెన్నూరు ప్రజలు చూపిన తెగువ ఐకమత్యం మరువలేదని అన్నారు. ఆత్మాభిమానం స్వయం పాలనకోసం కోసం ఐదున్నర దశాబ్దాలుగా తెలంగాణ పోరాటం కొనసాగుతుందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ వారికి కనీసం నీల్లివ్వని తెలుగుతల్లి తెలంగాణ వారికి ఎలా తల్లి అవుతుందని ప్రశ్నించారు. అన్నంపెట్టనని తల్లి తల్లేకాదు కాబట్టే తెలుగుతల్లి మాకొద్దు అని అన్నారు. తెలంగాణ గుండెకు నాటి నుండి నేటివరకు ఎన్నో గాయాలు తగులుతునే ఉన్నాయన్నారు. సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసే జీవోలు తెచ్చి తెలంగాణను ఎడారిగా మార్చారని తెలంగాణ ఉద్యోగాలు కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎత్తిన జెండా దించకుండా పోరాడి కొట్లాడి తెలంగాణ సాధించే సమయం ఆసన్నమైందని అన్నారు. మన ఉద్యోగాలు నీరు వనరులు ఆంధ్రోల్లు దోచుకున్నారని ఆరోపించారు. మన వనరులు నీరు ఉద్యోగాలు మనకు కావాలని తెలంగాణ కోరుకుంటున్నం గాని ఆంధ్రోడి ఆస్తులను కాదన్నారు. పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టి వనరులున్ని ఆంధ్రోడు దోచుకున్నారన్నారు. సింగరేణిలో అధికారులందరూ ఆంధ్రావారుండటమే తెలంగాణపై సర్కారు నిర్లక్షానికి చిన్న ఉదాహరణ అన్నారు. కేంద్రంతో చర్చల్లో సీమాంధ్రులు అన్నీ అబద్ధాలే వాగారని కావూరి సాంబశివరావు వాఖ్యలనుదహరించారు. తెలంగాణ ప్రజలు నాయకులు అంతా ఐకమత్యంగా ఉంటేనే తెలంగాణ సాధించడం జరుగుతుందన్నారు.