‘సోలో’ఆడియో చంద్రబాబునాయుడు ఆవిష్కరణ :సినీ జ్వాల తెలుగు:

Posted on

‘‘రోహిత్ తొలి సినిమా ‘బాణం’ మంచి సందేశాత్మక చిత్రంగా ప్రశంసలందుకుంది. ఈ మలి చిత్రం తాను ఏ పాత్ర అయినా పోషించగలడు అని రుజువు చేస్తుందని ఆశిస్తున్నాను’’ అని నారా చంద్రబాబునాయుడు అన్నారు. పరశురామ్ దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మిస్తున్న ‘సోలో’ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో చంద్రబాబునాయుడు చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన పై విధంగా స్పందించారు.

‘‘ఈ సినిమాకు నిజమైన హీరో నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాసే. కథ వినగానే డబ్బుకు వెనుకాడకుండా సినిమా తీయమని చెప్పారు. ఈ కథ నేను రాసుకోగానే హీరోగా నాకు స్ఫురణకు వచ్చింది నారా రోహిత్. తనకు ఈ సినిమా ఓ మైలురాయిలా నిలుస్తుంది. కథానాయిక నిషా అగర్వాల్ కూడా అద్భుతంగా నటించింది. ఇక మణిశర్మ సంగీతం ఈ సినిమా బ్యాక్‌బోన్’’ అని దర్శకుడు అన్నారు. ‘‘ఒక హిట్ సినిమా తీశానని నా నమ్మకం. యూనిట్ మొత్తానికీ ఈ సినిమా మంచి పేరు తెస్తుంది’’ అని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు.

తనకు మంచి కథను ఇచ్చినందుకు పరుశురామ్‌కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని, అభిరుచితో సినిమా తీసిన నిర్మాతకు, వినసొంపైన స్వరాలను అందించిన మణిశర్మకు థ్యాంక్స్ అని నారా రోహిత్ అన్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్, పళ్లం శ్రీనివాస్, రేవంత్‌రెడ్డి తదితర రాజకీయ నాయకులతో పాటు అల్లరి నరేష్, శర్వానంద్, నిషా అగర్వాల్, ప్రకాష్‌రాజ్, సయాజీ షిండే, జయసుధ, అలీ, రావురమేష్, ప్రొడక్షన్ కంట్రోలర్ యుగేందర్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.