విధుల‌కు హాజ‌ర‌య్యేది లేదు..! :CineJwala Telugu:

Posted on

తెలంగాణకు చెందిన 12 మంది మంత్రుల్లో ఎనిమిది మంది ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. మరో నలుగురు గైర్హాజరయ్యారు. కె. జానా రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి, సారయ్య, సునీతా లక్ష్మా రెడ్డి, డికె అరుణ ముఖ్యమంత్రితో ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. నలుగురు మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శంకరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. ఈ స‌మావేశంలో విధుల‌కు హాజ‌రుక‌మ్మని ముఖ్యమంత్రి వారిని కోరారు. అయితే తాము విధులకు హాజరయ్యేది లేదని వారు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తెలంగాణకు చెందిన ఎనిమిది మంది మంత్రులు శనివారం సాయంత్రం రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. సోమవారం నుంచి విధులకు హాజరు కావాలని కిరణ్ కుమార్ రెడ్డి చేసిన విజ్ఢప్తిని వారు తోసిపుచ్చారు.
ఉద్యమం తీవ్రమైన ప్రస్తుత తరుణంలో తాము విధులకు హాజరైతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పార్టీకి నష్టం జరుగుతుందని వారు చెప్పారు. తాము ప్రజల్లోకి వెళ్లలేని స్థితిలో ఉన్నప్పుడు విధులకు హాజరు కావడం వల్ల ప్రయోజనం ఏమీ లేదని వారు చెప్పారు. ఇప్పటికే తెలంగాణ అంశం కోసం టిడిపి తెలంగాణ ఫోరం త‌ర‌పున చురుకుగా ఉద్యమాలు ర‌చిస్తుండ‌డం, తెలంగాణ పొలిటిక‌ల్ జెఎసి కూడా త‌మ‌దైన శైలిలో ఉద్యమాలు రూపొందిస్తున్న ప్రస్తుత త‌రుణంలో తాము మంత్రులుగా కొన‌సాగితే న‌ష్టమే త‌ప్ప ఎలాంటి ప్రయోజ‌నం ఉండ‌ద‌ని తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రికి చెప్పారు.