కేసీఆర్ గ‌డువు ముగిసింది..! :CineJwala Telugu:

Posted on

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు పెట్టిన పద్నాలుగు రోజుల గడువు ముగిసిపోయింది.ఈ నెల పద్నాలుగో తేదీన చంద్రశేఖరరావు కాంగ్రెస్ తెలంగాణ నేతల నిరశన దీక్ష శిబిరం వద్ద ఆవేశంగా మాట్లాడుతూ తనకు ఢిల్లీ నుంచి సమాచారం ఉందని, రెండు వారాలలో తెలంగాణ పై కేంద్రం ప్రకటన చేయబోతున్నదని తెలిపారు. కాంగ్రెస్ నేతలకే తెలియని విషయం ఈయనకు ఎలా తెలిసిందబ్బా అంటూ అంతా ఆశ్చర్యపోయారు. ఆ తరుణంలో విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ కెసిఆర్ కు కౌంటర్ ఇస్తూ రెండు వారాలలోకాదు, నాలుగువారాలలో కూడా కేంద్రం ప్రకటన చేయబోదని సవాలు విసిరారు. కాని ఎక్కువమంది ఈసారి కెసిఆర్ నే నమ్మారు. కెసిఆర్ కు కాంగ్రెస్ అదిష్టానం ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయని,అందువల్ల ఆయన వద్ద సమాచారం ఉండవచ్చని భావించారు.
అయితే అప్పుడే కొందరు ఈ రెండువారాలు టెంపో కొనసాగించడానికి కెసిఆర్ ఇలా చెప్పి ఉండవచ్చని కొందరు ఊహించారు. కారణం ఏమైనప్పటికీ గులాం నబీ అజాద్ ఏకంగా రెండు నెలల తర్వాత తెలంగాణపై నిర్ణయం ఉంటుందని, అది కూడా అన్ని ప్రాంతాలవారితో చర్చలు జరిపిన తర్వాతేనని పేర్కొన్నారు.గతంలో కెసిఆర్ అనేక మార్లు వచ్చే వార్షికోత్సవం తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెబుతుండేవారు.అలాగే దసర వంటి పండగలు వచ్చినప్పుడు కూడా వచ్చే దసరా తెలంగాణ రాష్ట్రంలోజరుగుతుందని చెప్పేవారు.కాని ఈసారి రెండు వారాలు అని అతి తక్కువ గడువు పెట్టారు. బహుశా ఆయన గడువు మర్చిపోయారో, లేక మరే కారణమోకాని, ఇప్పుడు ఆయన కేంద్రం మెడపై కత్తి పెట్టి తెలంగాణ సాధించుకోవాలని, అంతా దీనిపై ఐక్యమత్యంగా ఉండాలని అంటున్నారు. కెసిఆర్ జోస్యం విఫలం అయినట్లేనా అని ఆయన ప్రత్యర్ధులు వ్యాఖ్యానిస్తున్నారు.