జగన్ జైలుకెళ్తే… :CineJwala Telugu:

Posted on

జగన్ కంపెనీలపై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ చేస్తున్న విచారణ, కేసు తదుపరి పరిణామాల కారణంగా ఒక వేళ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళాల్సి వస్తే, ఏం జరుగుతుందన్న చర్చ ఊపెక్కింది. జగన్ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే, అతని రాజకీయ జీవితం కుప్పకూలినట్టే అని ఒక పక్క కాంగ్రెస్, టిడిపీలోని పెద్దలు భావిస్తుంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన `చిన్నోళ్లు’ మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరస్పర విరుద్ధభావాల నేపథ్యంలో జగన్ జైలుకెళ్తే ఏం జరుగుతుందన్న ఈ రచయిత కొంతమంది రాజకీయ విశ్లేషకులను కదిలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అవి…
1. జగన్ జైలుకు వెళ్తే, కాంగ్రెస్ పార్టీ పెద్దలు అనుకుంటున్నట్టుగా జగన్ పార్టీకి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి) పెద్దగా నష్టం రాదు.

2. జగన్ జైలుకు వెళ్లడమన్నది ప్రజల్లో ఓ పాజిటీవ్ ఇమేజ్ నే క్రియేట్ చేస్తుంది.

3. వాస్తవాలను అధికార కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు తెలుసుకోలేకపోతున్నారు. జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను చాలా తక్కువగా ఊహించుకుంటున్నారు. వీరిలో కొన్ని రకాల భ్రమలు, అపోహలు ఉన్నాయి. జగన్ అక్రమ సంపాదన వ్యవహారం తేలినా, న్యాయస్థానాలు తీర్పు చెప్పినా, ఆయన జైలుకు వెళ్ళినా ప్రజల్లో కూడగట్టుకున్న అభిమానం మరింత పెరిగే అవకాశమే ఉంటుందేతప్ప, ఇసుమంత కూడా తగ్గదు.

4. జగన్ ఇప్పటికే ప్రజల్లో కూడగట్టుకున్న ప్రజాఅభిమానంతో ఆయన  జైల్లో ఉన్నా, `కథ’ నడిపించగలరు.

5. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతోనే జగన్ ఊహించినదానికంటే ఎక్కువగానే సానుభూతి సంపాదించుకున్నారు. పైగా ఓదార్పు యాత్రలతో ఇది మరింత ఎక్కువ అవుతోంది. దీనికి తోడుగా, జగన్ జైలుకు వెళ్తే, కచ్చితంగా ఈ సానుభూతి మరింత ఎక్కువ అవుతుంది. దీంతో జైల్లో ఉన్నా, జగన్ మహానేతగానే వెలిగిపోవడం ఖాయం.

6. రాజకీయ చదరంగంలో కాంగ్రెస్ కదుపుతున్న పావులు చివరకు జగన్ కు చెక్ పెట్టకపోగా, ఆయనకే సహకరించవచ్చు.

7. తమిళనాట  రాజ, కనిమొళిలకు జరిగిన నష్టం అలాగే డీఎంకెకు వాటిల్లిన కష్టం వంటివి ఇక్కడ జగన్ కు గానీ, ఆయన ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ కలగే అవకాశాలు లేవు. అంటే, తమిళనాడులో వేసిన మంత్రం ఇక్కడ పారదు.

8. తాను జైలుకు వెళ్ళాల్సి వస్తుందేమోనన్న భయం జగన్ కు కూడా లేకపోలేదు. అందుకే, ఆయన ఇప్పటి నుంచే రాజకీయ పవర్ ను డీసెంట్రలైజ్ (వికేంద్రీకరణ) చేస్తున్నారు. పార్టీ అంటే తానొక్కడే అన్న భావన నుంచి పార్టీ అంటే అనేక యువనేతల సమాహారమన్న దిశగా జగన్ పార్టీని తీసుకువెళ్తున్నారు.

9. అందుకే, డోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రకటించారు. ఇకపై మిగతా నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించవచ్చు.

10. మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయన్న సంకేతాన్ని ఇవ్వడం కోసమే జగన్ ఈ ప్రకటనలు చేశారని అనుకోలేము, అంతకంటే మరో వ్యూహం ఏమిటంటే, తన పార్టీ పవర్ ను డిసెంట్రలైజేషన్ చేయడమే.

11. అలా చేస్తే, జగన్ జైల్లో ఉన్నా పార్టీకి జరిగే నష్టం బహుస్వల్పమే అవుతుంది.

12. అంటే, జగన్ జైల్లో ఉన్నా, ఆ పార్టీ అఖండ విజయం సాధించడానికి ఇప్పటి నుంచే వ్యూహరచన ప్రారంభమైందనే అనుకోవాలి.

13. జగన్ అనూలోచితంగానో, లేదా, ఆవేశపూరితంగానో ప్రకటనలు చేయడంలేదు. వ్యూహాత్మకంగానే పావులు కదుపుతున్నారు. ఈ వ్యూహాలు ఫలిస్తే, రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. తెలుగుదేశం పార్టీ విస్తుపోవడం ఖాయం.