క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు :సినీ జ్వాల తెలుగు:

Posted on

‘‘నేనెప్పుడూ ఇంత కావాలని డిమాండ్ చేయలేదు. అలాగని అవకాశాల కోసం పారితోషికం తగ్గించుకోనూలేదు’’ అంటున్నారు ఇలియానా. ప్రస్తుతం ఆమె హిందీ చిత్రం ‘బర్ఫీ’లో యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అవకాశం తెచ్చుకోవడం కోసం ఇలియానా పారితోషికం తగ్గించుకున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ సందర్భంగానే ఆమె పై విధంగా స్పందించారు. ఈ గోవా బ్యూటీ ఇంకా మాట్లాడుతూ – ‘‘హీరోయిన్ అయిన తర్వాత ఇప్పటివరకు నేనెంత బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నానో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

వరుసగా అవకాశాలు వస్తున్నాయి కదా.. క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. మార్కెట్లో నాకున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇష్టపూర్వకంగా ఇస్తున్నారు. నా రేంజ్‌కి తగ్గ పారితోషికం తీసుకుంటే తప్పేంటి? అలాగే ఈ మధ్య హిందీ, తమిళ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాను కాబట్టి తెలుగు సినిమాలకు డేట్స్ కేటాయించలేకపోయాను. దాంతో ఇలియానాకి తెలుగులో అవకాశాలు లేవని ప్రచారం చేశారు. ఆ వార్త విని షాక్ అయ్యాను.

ఆ షాక్ నుంచి తేరుకునే లోపు అవకాశాలు సంపాదించుకోవడం కోసం ఇలియానా పారితోషికం తగ్గించాలనుకుంటోందని మరో వార్త ప్రచారం చేశారు. టైమ్‌పాస్ కోసం ఇలా కల్పితాలు సృష్టించడం ఏమాత్రం సరి కాదు. ఇప్పటివరకు నేను యాక్ట్ చేసిన సినిమాలు నటిగా నా సత్తా నిరూపించాయి. నాకంటూ మంచి పేరుంది. నా అవకాశాలు నాకెప్పుడూ ఉంటాయి.