అమెరికాలో మరో ట్రైవ్యాలీ :CineJwala Telugu:

Posted on

వీసా అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలు గురువారం నాడు ఉత్తర వర్జీనియా విశ్వవిద్యా లయంపై దాడి చేశాయి. ఈ యూనివర్సిటీలోని వందలాది మంది భారతీయ విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని అమెరికా వాగ్దానం చేసింది. రోజంతా జరిగిన దాడిలో ఇమ్మిగ్రేషన్‌ కష్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నేరదర్యాప్తు సంస్థ సహా వివిధ ప్రభుత్వ సంస్థ అధికారులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయానికి చెందిన అనండేల్‌ ఆవరణలోకి ప్రవేశించిన అధికారులు పత్రాలు? కంప్యూటర్‌ హార్డ్‌డ్రైవ్‌లతో కూడిన అనేక భారీ పెట్టెలను తమతో తీసుకొని వెళ్ళారు. శుక్రవారం నాడు కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విద్యార్థుల మార్పిడి కార్యక్రమం విభాగం యూనివర్సిటీకి నోటీసులు జారీ చేశాయి. విశ్వవిద్యాలయానికి విదేశీ విద్యార్థులను చేర్చుకొనేందుకు గల అధికారాన్ని ఎందుకు రద్దు చేయకూడదో సంజాయిషీ కోరాయి. వాషింగ్టన్‌ శివార్లలోని వర్జీనియాకి చెందిన అనండేల్‌లో గల ఈ విశ్వవిద్యాలయంలో 2400 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 90శాతం మంది భారతీయులే. అందులో కూడా అత్యధికులు ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారే.
విశ్వవిద్యాలయం ఎటువంటి వ్యాఖ్యచేసేందుకు నిరాకరించింది. సిబ్బందితో కాని విద్యార్థులతో కాని సంప్రదింపులు జరపనేలేదు. అయితే ''విశ్వవిద్యాలయం ఇంకా తెరిచే ఉందని విద్యార్థులు ఇష్టమైతే ఇతర విశ్వవిద్యాలయాలకు వెళ్ళే అవకాశం యింకా ఉందని'' వర్సిటీ ప్రవేశ ద్వారం వద్ద ఒక నోటీసు పెట్టింది. ఈ విశ్వవిద్యాల యానికి యాభై మంది విద్యార్థులకు ఐ-20 ఫారం జారీ చేసే అధికారం ఉందని అయితే అంతకు మించి పెద్ద సంఖ్యలో ఫారాలను జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా ట్రై వ్యాలీ కేసు అనుభ వంతో అమెరికా అధికారులు భారతీయ అధికారులకు ఈ కేసు విషయంలో భిన్నంగా వ్యవహరించనున్నట్లు తెలియచేయవచ్చునని విశ్వసిస్తున్నారు. ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం సంఘటనలో భారతీయ విద్యార్థుల పట్ల వారు వ్యవహరించిన తీరును భారత్‌ తీవ్రంగా ఖండించింది. అయితే ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం ఉదంతానికి భిన్నంగా ఇక్కడ దర్యాప్తు విద్యార్థుల మీద కాక విద్యాలయం పైనే కేంద్రీకృతమైంది. విద్యార్థులను అరెస్టు చేయడం లేదా ఎలక్ట్రానిక్‌ పర్యవేక్షణలో ఉంచడం జరగదని అధికారులు స్పష్టం చేశారు. యూనివర్సిటీని తక్షణం మూసివేయబోమని అయితే వారు వివరణ ఇచ్చుకునేందుకు వీలుగా కొన్ని మాసాల గడువు ఇస్తామని తెలిపారు.