హైదరాబాద్: తన ప్రాణం పోయినా సరే తాను మాత్రం ముందుగా ప్రకటించినట్టుగా దీక్ష చేసి తీరుతానని ప్రముఖ గాంధేయవాది అన్నా హాజారే ప్రకటించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన చేపట్టనున్న దీక్షపై ప్రభుత్వం ఆంక్షలు విధించి నమ్మక ద్రోహానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని సర్కారు ఖూనీ చేస్తోందంటూ ఘాటుగా విమర్శించారు. ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండాను ఏ ముఖం పెట్టుకుని ఎగరేస్తారంటూ నిలదీశారు. మీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వారిని అణచివేసేందుకు, ప్రాథమిక హక్కులను కాలరేసేందుకు కుట్రలు పన్నుతోందంటూ ధ్వజమెత్తారు. ఇది సరైన పద్ధతి కాదంటూనే అవినీతి రహిత భారత్ కోసం మేమంతా పోరాటం సాగిస్తుంటే నియంతృత్వ ధోరణితో మీరు ముందుకు వెళ్తున్నారు. దేశం మొత్తం 65వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునేందుకు సిద్ధమవుతుంటే, మీరు మా హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.