న్యూఢిల్లీ: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో విధ్వంసం సృష్టించేందుకు పథక రచన పాకిస్థాన్‌లోనే చేసినట్టు తేలింది. 26/11 దాడులకు సంబంధించి పాక్‌లో విచారణ ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితుల్లో ఒకరి స్వరాన్ని (వాయిస్ టెస్టింగ్) ప్రాసిక్యూషన్ తరపు సాక్షి గుర్తించారు. పాక్‌లో ఉండి ముంబైలో దాడి సందర్భంగా ఉగ్రవాదులకు ఆదేశాలు జారీ చేసిన వారి స్వర నమూనా నిందితుల్లో ఒకరికి సరిపోయిందని ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు జడ్జి షాహిద్ రఫిక్ ముందు ఫెడరల్ ఏజెన్సీ ఇన్‌స్పెక్టర్ నసీర్ అహ్మద్ సాక్షమిచ్చారు. అంతేకాక కరాచీలో లష్కరే తొయిబా నిర్వహించిన శిక్షణ శిబిరంలో తాము చేసిన సోదాల గురించి కూడా ఆయన కోర్టుకు తెలిపారు. ఈ వాదనను నిందితుల తరపు న్యాయవాది కాజా సుల్తాన్ తోసిపుచ్చారు.