దీక్షకు అనుమతిస్తేనే బయటకొస్తా: హజారే :సినీ జ్వాల తెలుగు:

Posted on

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి శృంగంభంగమైంది. ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే అరెస్టు విషయంలో పూర్తిగా పప్పులో కాలేసింది. ఆయనను అరెస్టు చేసిన 12 గంటల్లోనే హజారే పాటు ఆయన బృందం సభ్యులను విడుదల చేయాల్సిందిగా కేంద్రం ఆదేశించారు. అయితే, తీహార్ జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. తాను చేపట్టదలచిన దీక్షకు అనుమతిస్తేనే జైలు గది నుంచి కాలు బయటపెడతానని ప్రకటించారు. అప్పటి వరకు జైలు గదిలోనే దీక్ష కొనసాగిస్తానని హెచ్చరించారు. చివరి రక్తపుబొట్టు ఉన్నంత వరకు ఈ దేశ శ్రేయస్సు కోసం పాటుపడుతానంటూ ఆయన గద్గద స్వరంతో ప్రకటించారు. ఇందుకు యావత్ భారతావని కలిసి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు కోసం ఆయన ఈనెల 16వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడమే కాకుండా.. దీక్షా స్థలికి వెళుతున్న హజారేను అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి తీహార్ జైలుకు తరలించారు. అక్కడ అవినీతిపరులున్న గదుల్లోనే వారిని బంధించడంతో యావత్ భారతావని భగ్గుమంది. అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతున్న హజారేను అవినీతిపరులతో జతకట్టిస్తారా అంటూ మండిపడింది. దీంతో అరెస్టు చేసిన 12 గంటల్లోనే కేంద్ర కాళ్ళబేరానికి దిగింది. హజారేను భేషరతుగా విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే, హజారే మాత్రం ఈ కేంద్రం ఆదేశాలను ధిక్కరించారు. తన దీక్షకు అనుమతి ఇస్తేనే జైలు నుంచి బయటకు వస్తానని మొండిపట్టుపట్టారు. దీంతో కేంద్రానికి ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. విడుదల ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. ఏమీ చేయలేని నిస్సహాయత స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇటు దీక్షకు అనుమతి ఇస్తే ఒక సమస్య.. ఇవ్వక పోరే మరో పెద్ద సమస్య కళ్లముందు కనిపిస్తోంది. ఫలితంగా యూపీఏ పాలకులు తలలు పట్టుకున్నారు.