న్యూఢిల్లీ : అన్నా హజారే అరెస్ట్‌ను ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సమర్థించుకున్నారు. హజారే అరెస్ట్‌పై ప్రధాని బుధవారం లోక్‌సభలో ప్రకటన చేశారు. పోలీస్ నిబంధనలు ఉల్లంఘించినందుకే అరెస్ట్ చేశామన్నారు. నిన్న ఢిల్లీలో జరిగిన సంఘటనలు బాధాకరమని, తప్పని పరిస్థితుల్లోనే హజారేను అరెస్ట్ చేసినట్లు మన్మోహన్ చెప్పుకొచ్చారు. జేపీ పార్క్ వద్ద హజారే దీక్షకు అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగానే హజారేతో పాటు మరో ఆరుగుర్ని అరెస్ట్ చేశారని మన్మోహన్ ఢిల్లీ పోలీసుల్ని వెనకేసుకొచ్చారు. అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతోనే లోక్‌పాల్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టామని ప్రధాని తెలిపారు. అవినీతిని పారదోలేందుకు మంత్రదండం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ప్రధాని ప్రకటనపై లోక్‌సభలో విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేసి, ఆందోళనకు దిగాయి