సభాహక్కుల ఉల్లంఘనః నాగంకు నోటీసు :సినీ జ్వాల తెలుగు:

Posted on

హైదరాబాద్: శాసనసభ్యులు నాగం జనార్ధన్‌ రెడ్డి, కొప్పుల హరీశ్వర్‌ రెడ్డిలకు శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చారు. స్పీకర్‌ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు స్పీకర్‌ కనిపించడంలేదంటూ నాగం ఇచ్చిన పోలీసు ఫిర్యాదు పట్ల స్పీకర్‌ ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఇదిలాఉంటే స్పీకర్‌ జారీచేసిన నోటీసులకు తాము భయపడమని నాగం జనార్ధన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేసిన తరువాత కూడా స్పీకర్‌ ఆమోదించకపోవడంతో, స్పీకర్‌ కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నాగం మీడియాకు తెలిపారు.

నాగం జనార్ధన్‌ రెడ్డి, కొప్పుల హరీశ్వర్‌ రెడ్డి, జోగు రామన్నలు మంగళవారం స్పీకర్‌ నాదెండ్ల మనోహన్‌ను కలిసి, తమ రాజీనామాలను ఆమోదించాలని కోరగా, వెంటనే స్పీకర్‌ స్పందిస్తూ తాను కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం ఏమిటని నాగంను ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతరం నాగం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో యువకుల బలిదానాలకు బాధ్యత ఎవరిదో తెలుసుకోవల్సిన బాధ్యత స్పీకర్‌కు లేదా అని ప్రశ్నించారు. ఆయన తెలంగాణ ప్రాంతానికి స్పీకర్‌ కాదా ? ఈ విషయంలో స్పీకర్‌ ఆత్మవిమర్శ చేసుకోవాలని నాగం అన్నారు. అయితే తాము ఉద్యమంలోకి వచ్చే ముందు దేనికి భయపడేది లేదని నిర్ణయించుకున్నామన్నారు.