హైదరాబాద్: జగన్ కు గానీ, ఆయన వర్గానికి గానీ ధైర్యం ఉంటె ఎమ్మార్, హెరిటేజ్ సంస్థలపై బహిరంగ చర్చకు రావాలని తెలుగుదేశం పార్టీ సవాల్ విసిరింది. సాక్షి పత్రిక చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అది పత్రిక కాదు, జగన్ కరపత్రమని వాళ్ళు ప్రకటిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. హెరిటేజ్ సంస్థ స్థాపించి ఇప్పటికి 19 సంవత్సరాలైందని, ఇప్పటి దాని విలువ లోటస్ పాండ్ లో జగన్ అక్రమసొమ్ముతో కట్టుకున్న ఇంటి పునాదులు ఖరీదు కంటే తక్కువేనని ఆయనన్నారు. ప్రతీ ప్రభుత్వం పారిశ్రామిక విధానం కింద ఐదేళ్లకోశారు పరిశ్రమలకు కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తుందని, అలా కొన్ని వందల కంపెనీలతో పాటుగా హెరిటేజ్ కూ రాయితీలు వర్తించాయన్నారు. ఎమ్మార్ విషయంలో చంద్రబాబు హయాంలో జరిగిన ఒప్పందాలన్నింటికీ 2005లోనే కాలం చెల్లిందని, వైఎస్ వచ్చాక కుదుర్చుకున్న ఒప్పందాల వల్లే ప్రభుత్వ వాటా 5 శాతానికి పడిపోయిందన్నారు.