బెంగాలీ ముద్దుగుమ్మ రీమాసేన్ ఓ తమిళ నిర్మాత మీద ఇప్పుడు చాలా కోపంగా వుంది. దానికి కారణం... ఆమధ్య రీమాసేన్ నటించిన 'ఇతి శ్రీకాంత' అనే బెంగాలీ సినిమాని తాజాగా ఒకాయన తమిళంలోకి అనువదిస్తున్నాడు. ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్ రాసిన నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఇంత వరకు బాగానే వుంది. ఇక్కడే అసలు వివాదం స్టార్ట్ అయింది. తమిళ ప్రేక్షకులకి రీమాసేన్ తెలుసు కాబట్టి, శృంగార భంగిమలలో వున్న ఆమె ఫోటోలను పోస్టర్లుగా వేసి నిర్మాత సినిమా పబ్లిసిటీ చేస్తున్నాడు. ఇది రీమా దృష్టికి వెళ్ళడంతో, ఆ పోస్టర్లను చూసిన ఆమె సదరు నిర్మాత మీద అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. "నా ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్టర్లు వేశారు. తల నాది తీసుకుని వీపు భాగాన్ని మరొకరి ఫోటోతో మార్ఫింగ్ చేశారు. ఇది చాలా అన్యాయం. నిర్మాత మీద లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాను" అంటోంది రీమా.