తెలంగాణపై ఏకాభిప్రాయం కావాలని, అది రాష్ట్ర స్థాయిలో జరగాలని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటనపై కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నాయకుడు కె. కేశవరావు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణపై ఏకాభిప్రాయ సాధన కోసం చర్చలకు తాము సిద్ధమేనని, అయితే ఏకాభిప్రాయం కుదరకపోతే రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. 2001 – 2009 మధ్య కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా పలు మార్లు తన వైఖరిని వ్యక్తం చేసిందని ఆయన అన్నారు. తెలంగాణను యుపిఎ తన కనీస ఉమ్మడి ప్రణాళికలో కూడా చేర్చిందని ఆయన అన్నారు. పార్టీల ఏకాభిప్రాయం కావాలని అడిగినప్పుడు ఒక్కో పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులను అఖిల పక్ష సమావేశానికి ఎందుకు పిలిచారని ఆయన చిదంబరాన్ని అడిగారు. తెలంగాణపై చిదంబరం పార్లమెంటును తప్పుదోవ పట్టించారని తెలంగాణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు చిదంబరం మంత్రిగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు.