అడ్డుకుంది రోష‌య్యే…! :CineJwala Telugu:

Posted on

తానే తెలంగాణకు అడ్డుపడ్డానన్న నల్లగొండ లోక్ సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపణను మాజీ ముఖ్యమంత్రి రోశయ్య తిప్పికొట్టారు. స్వయంగా ఆయనే ఎన్టీవి చర్చా కార్యక్రమంలో గుత్తాతో మాట్లాడి తన వాదనను సమర్ధంగా వినిపించారు. రెండు వేల తొమ్మిది డిసెంబరు తొమ్మిది న ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య కు కేంద్ర నాయక్తవం చెప్పినది ఒకటైతే, ఇక్కడకు వచ్చాక జరిగింది మరొకటని, రోశయ్యే మొత్తం పరిస్థితిని మార్చారని, ఆ యన తెలగాణాకు అడ్డుపడ్డారని, కేంద్ర హోం మంత్రి చిదంబరం స్వయంగా తమకు ఈ విషయం వెల్లడించారని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. ఆ మీదట రోశయ్య చర్చలోకి వచ్చి తీవ్రంగా ఖండించారు. తాను ఏ ప్రమాణం చేయడానికైనా సిద్దమేనని, ఏ గుడిలోనైనా ప్రమాణం చేస్తానని సవాలు చేశారు. డిసెంబరు తొమ్మిదిన ప్రధాని మన్మోహన్ సింగ్ , సోనియాగాంధీ ల సమక్షంలో తనను తెలంగాణ తీర్మానం చేయించాలని కోరారని,కాని దానికి అంగీకరించలేదని, మెజార్టీ సభ్యులు వేరే ప్రాంతం వారు ఉన్నప్పుడు అది సాధ్యపడదని స్పష్టంగా చెప్పానని, అప్పుడు తనను హైదరాబాద్ వెళ్లాలని, తర్వాత తాము ఏమి చేయాలో చెబుతామని అన్నారు రోశయ్య స్పష్టం చేశారు. ఆ తర్వాత తాను విమానంలో ఉండగానే కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణపై ప్రకటన చేశారని, ఇదీ సంగతి అని రోశయ్య వివరించారు. మీరు ఆత్మసాక్షిగా ఆ మాట చెప్పగలరా అని గుత్తా ప్రశ్నించగా, ఆత్మసాక్షిగానే కాదు. ఏ దైవసాక్షిగానైనా చెబుతానని అన్నప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తగ్గారు. అయితే చిదంబరం చెప్పినందువల్లనే తాము దానిని నమ్మామని ఆయన అన్నారు. కాగా రోశయ్య చెప్పినందువల్లనే రాజీనామాలు చేశామని డి.ఎల్.రవీంద్ర రెడ్డి తెలిపారని గుత్తా అంటున్నారు. తెలంగాణకు సంబంధించి తాను ఎక్కడా అడ్డుపడలేదని రోశయ్య ఖండితంగా చెప్పడం విశేషం.