ఎవరెవరు ఇరుక్కుంటారో !? :CineJwala Telugu:

Posted on

ఎమ్మార్‌పై సిబిఐ దర్యాప్తుతో దడ వణుకుతున్న మంత్రులు, అధికార్లు పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం బాబు హయాంలోని మంత్రులకూ చిక్కులు నిష్పక్షపాతంగా జరిగితే ఉచ్చులో పడనున్న పెద్ద తలకాయలు జగన్ ఆస్తుల కేసులోనూ మంత్రుల్లో వణుకు

ఎమ్మార్ ప్రాపర్టీస్, జగన్ ఆస్తుల వ్యవహారంపై పూర్తిస్థాయి సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశించడంతో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి దారి తీస్తుంది, ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందన్న ఆందోళన సీనియర్ ఐఎఎస్ అధికారుల్లోను, మంత్రుల్లోను, మాజీ మంత్రుల్లోను వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారాల్లో తమకు ఎటువంటి సంబంధం లేదని, తమకు ఏమీ కాదని మంత్రులు, అధికారులు పైకి చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వారు భయపడుతున్నారు. సిబిఐ విచారణ ఏ కోణంలో జరుగుతుంది, వ్యక్తులపైనా, వ్యవస్థపైనా అన్న దానిపై ఈ వ్యవహారాల్లో ఎవరెవరు ఇరుక్కుంటారన్నది ఆధారపడి ఉంటుందని మాజీ మంత్రి ఒకరు అభిప్రాయపడ్డారు. నిన్నటి వరకు న్యాయస్థానం పరిధిలో ఉన్న ఎమ్మార్, జగన్ ఆస్తుల వ్యవహారం ఇప్పుడు సిబిఐ చేతుల్లోకి మారింది. కేంద్రప్రభుత్వ ఆధీనంలో పని చేసే సిబిఐపై రాజకీయ ప్రభావం చూపినట్లయితే ఒక రకంగా, నిష్పక్ష పాతంగా వ్యవహరించినట్లయితే మరో విధంగా దర్యాప్తు సాగుతుందని, న్యాయస్థానం జరిపే విచారణకు భిన్నంగానే సిబిఐ విచారణ కచ్చితంగా ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సిబిఐ నిష్పక్షపాతంగా ఎమ్మార్‌పై విచారణ జరిపినట్లయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పని చేస్తున్న కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, టిడిపి అధినేత చంద్రబాబు హయాంలో ఆయన మంత్రివర్గంలో పని చేసిన కొందరికి, చంద్రబాబు హయాం నుంచి నిన్నటి వరకు పరిశ్రమలు, వౌలిక సదుపాయాల శాఖల్లో పని చేసిన పలువురు సీనియర్ ఐపిఎస్ అధికారులు కూడా చిక్కుల్లో పడకతప్పదని భావిస్తున్నారు. అయితే కేంద్రప్రభుత్వ ప్రభావం సిబిఐపైన, అది జరిపే విచారణపైనా ఎంత మేరకు పని చేస్తుందన్న దాన్నిబట్టి కూడా ఎవరు ఇందులో ఇరుక్కుంటారన్నది ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
ఎమ్మార్ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక సీనియర్ ఐఎఎస్ అధికారిని, మంత్రిని అడిగినపుడు ఈ విషయంలో తమకు ఎటువంటి సంబంధం లేదని, రికార్డుల పరంగా ఎక్కడా తప్పుపట్టడానికి లేదని అన్నారు. ‘నేను వ్యక్తిగతంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, బోర్డు సమావేశంలో చర్చించి మాత్రమే నిర్ణయాలు తీసుకున్నాం, ఆ నిర్ణయాలనే అమలు చేశాం, అన్ని రికార్డులు సక్రమంగానే ఉన్నాయి’ అని వైఎస్ హయాంలో కీలకమైన ఎపిఐఐసి చైర్మన్‌గా పని చేసిన మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాను ఎటువంటి చిక్కుల్లోను ఇరుక్కోననే ధీమాతో ఆయన ఉన్నారు. ఎమ్మార్, జగన్ ఆస్తుల వ్యవహారంలో కేవలం అధికారులు మాత్రమే బలవుతారా లేక కొందరు మంత్రులు, ఇతరులు కూడా చిక్కుకుంటారా అన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఎమ్మార్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పులో చేసిన కొన్ని వ్యాఖ్యలు సైతం రాజకీయ వర్గాల్లో చర్చలకు దారి తీస్తోంది. ‘కొంతమంది ‘బయటి’ వ్యక్తుల ప్రమేయం కూడా స్పష్టంగా ఉంది’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ బయటి వ్యక్తులు ఎవరన్నదానిపై రాజకీయ వర్గాలు తమకు తోచిన విధంగా చెప్పుకుంటున్నారు. వైఎస్ హయాంలో ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక పాత్ర వహించిన వారినెవరినైనా ఉద్దేశించి హైకోర్టు ఈ వ్యాఖ్య చేసి ఉండవచ్చని అనుకుంటున్నారు.
ఎమ్మార్ వ్యవహారంలో ప్రస్తుత మంత్రుల్లో నలుగురైదుగురు, చంద్రబాబు మంత్రివర్గంలో పని చేసిన ఇద్దరు ముగ్గురు, పది మంది వరకు ఐఎఎస్ అధికారులకు ప్రమేయం ఉండి ఉండవచ్చని అనుకుంటున్నారు. చంద్రబాబు నుంచి వైఎస్ హయాం వరకు పని చేసిన పది మంది ఐఎఎస్‌ల వరకు ప్రమేయం ఉండి ఉండవచ్చనుకుంటున్నా వారిలో ముగ్గురు, నలుగురు అధికారులు గతంనుంచీ తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఎమ్మార్ వ్యవహారం కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల్లో మంత్రులుగా పని చేసిన చేస్తున్న వారు ఇరుక్కునే అవకాశాలుండగా, జగన్ ఆస్తుల కేసులో కాంగ్రెస్ మంత్రులు మాత్రమే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పారిశ్రామిక రంగంపై ప్రభావం
జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోని ప్రముఖ సంస్థలు కొన్ని ఉన్నాయి. ఈ సంస్థలు కేవలం జగన్ సంస్థల్లోనే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల్లోని సంస్థల్లో కూడా పెట్టుబడులు పెట్టాయి. విచారణ పేరుతో ఈ సంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేసినట్లయితే దాని ప్రభావం కేవలం జగన్ సంస్థలపైనా కాకుండా వారి పెట్టుబడులున్న ఇతర సంస్థలపై కూడా చూపించవచ్చని, తద్వార పారిశ్రామిక రంగమే దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు. సిబిఐ విచారణ ప్రారంభిస్తే తప్ప ఆ సంస్థ ఏ కోణంలో దర్యాప్తు జరుపుతోంది, ఎవరిని లక్ష్యంగా చేసుకుని విచారణ సాగుతోందన్నది బయటపడదని భావిస్తున్నారు.