నేడు 14ఎఫ్ తొలగింపు? ఎస్సై రాతపరీక్షల లోపే కేంద్రం నిర్ణయం... సర్కారు ఆశాభావం :CineJwala Telugu:

Posted on

తెలంగాణలో ప్రధాన డిమాండ్‌గా ఉన్న రాష్టప్రతి ఉత్తర్వుల్లోని 14ఎఫ్ క్లాజు తొలగింపుపై శుక్రవారం ఒక కీలక నిర్ణయం వెలువడుతుందని ప్రభుత్వం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం కదిలిరావడం, ఉరుకులు పరుగులపై ఆ లేఖ రాష్టప్రతి భవన్‌కు చేరుకోవడంతో ఇక 14ఎఫ్ తొలగిపోయినట్లేనని తెలంగాణ ప్రజా ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.
13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సై రాతపరీక్షలు నిర్వహించనుండడంతో ఈలోగానే 14ఎఫ్ క్లాజును తొలగించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్ కూడా గురువారం వెల్లడించారు. పరీక్షలు నిర్వహించడానికి ముందుగానే 14ఎఫ్‌ను తొలగించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి చిదంబరానికి లేఖ రాయడం, అక్కడి నుండి ఆ లేఖ ప్రధాన మంత్రికి, అక్కడి నుండి రాష్టప్రతికి వెళ్లింది. ఈ లేఖపై శుక్రవారం రాష్టప్రతి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. 14 ఎఫ్ క్లాజు తొలగింపును డిమాండ్ చేస్తూ తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు గత మూడేళ్లుగా ఎస్సై పరీక్షలను అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. 2008లో ఈ పరీక్షలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటివరకు పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో అనేక మంది అభ్యర్ధుల వయోపరిమితి దాటిపోవడంతో వారంతా అనర్హతకు గురయ్యారు. ఇంకా ఈ విషయంలో జాప్యం జరిగితే మరికొంత మంది కూడా అనర్హులుగా మారిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల 14ఎఫ్‌ను తొలగించేందుకు గట్టిగా ప్రయత్నించాలని ప్రభుత్వంపై తెలంగాణ ప్రజాప్రతినిధుల నుండి ఒత్తిడి అధికమైంది. గత ఏడాది శాసనసభలో ఈ క్లాజును తొలగించాలని నిర్ణయిస్తూ తీర్మానం చేయగా, దానికి కాలదోషం పట్టిందని, అందుకే మరోసారి తీర్మానం చేసి పంపించాలని కేంద్రం కోరడం, దానిని ముఖ్యమంత్రి తిరస్కరిస్తూ గత తీర్మానానే్న పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్ధిస్తూ లేఖ రాయడం తెలిసిందే. ఈ సమయంలోనే 14ఎఫ్ క్లాజుపై గురువారం ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని ప్రభుత్వం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది.