లగడపాటికి రాజకీయ సన్యాసమే :CineJwala Telugu:

Posted on

హైదరాబాద్: తమ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై అవాకులు చెవాకులు పేలితే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు రాజకీయ సన్యాసం తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ అక్రమాస్తులపై సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టక ముందు నుంచే జగన్మోహన్‌ రెడ్డికి జైలు శిక్ష తప్పదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అయితే జగన్ జైలు కెళ్తారా.. లగడపాటి జైలుకెళ్తారా అనేది భవిష్యత్తులో తేలుతుందన్నారు. జగన్‌పై ఢిల్లీ స్థాయిలోనే కుట్ర జరుగుతోందని, ఇలాంటి చర్యలను లగడపాటి వంటి వారు ఎగదోస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. ఇలాంటి బెదిరింపులకు తాము బెదరబోమన్నారు. నగర పార్టీ ఎన్నికల పరిశీలకుడు పీ గౌతంరెడ్డి మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో జగన్ ఓదార్పుయాత్ర సందర్భంగా అభిమానులు వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటుంటే అధికార పార్టీ నేతలు కుయుక్తులతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు.