యన్టీఆర్, నాగచైతన్య కలిసి 'గుండమ్మ కథ'ను రీమేక్ చేయాలనుకుంటున్నట్టు ఇటీవల మళ్లీ వార్తలు బాగా వస్తున్నాయి. ఈ సినిమాను రామానాయుడు నిర్మిస్తారని కొందరూ, లేదు... అశ్వనీదత్ ప్లాన్ చేస్తున్నాడని మరి కొందరూ అంటున్నారు. దీనితో బాటుగా, ఈ సినిమాలో ఇతర పాత్రల్లో నటించే వాళ్ల గురించి కూడా విశ్లేషణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అలనాటి మేటినటి సూర్యకాంతం పోషించిన గుండమ్మ పాత్రను ఎవరు పోషించగలరన్న డిస్కషన్ బాగా జరుగుతోంది. ఇటు మీడియాలో కూడా ఈ విషయం మీద అనాలిసిస్ జరుగుతోంది. వాణిశ్రీ సూట్ అవుతుందని కొందరు, రాధ అని కొందరూ, రాధిక అని మరికొందరూ... ఎవరికి తోచిన పేర్లు వాళ్లు చెప్పేస్తున్నారు. అయితే, ఎవరు చేసినా అది కృత్రిమంగానే ఉంటుందనీ, సూర్యకాంతంని రీప్లేస్ చేసే వాళ్లు ఎవరున్నారనీ కొంత మంది వాదిస్తున్నారు. ఏమైనా, ఆ సినిమాని ముట్టుకోకపోవడమే మంచిదని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.