ఆస్తులు కోట్లలో,వాహనమే సున్నా :సినీ జ్వాల తెలుగు:

Posted on

హైదరాబాద్: పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు కోట్ల రూపాయల్లో ఆస్తులున్నాయి.అయితే,తనకు గానీ తన భార్యకు గానీ వాహనం కూడా లేదని డిఎస్ చెప్పారు. ఎమ్మెల్సీ సీటుకు నామినేషన్ వేసిన డి. శ్రీనివాస్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు గానీ తన భార్యకు గానీ వాహనం లేదని, రుణాలు కూడా లేవని ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. రెండు బ్యాంకు ఖాతాల్లో రూ. 10.52 లక్షల రూపాయలు ఉన్నట్లు ఆయన తెలిపారు. రూ. 48,96,000 విలువ చేసే బాండ్స్, డిబెంచర్స్ ఉన్నాయి. రూ. 8,30,000 విలువ చేసే బంగారం ఉంది.డిఎస్‌కు షంషాబాద్‌లో ముచెంతలలో 3 ఎకరాల భూమి ఉంది. దాని విలు రూ. 21 లక్షలు ఉంటుంది. మరో మూడు ఎకరాల భూమి నిజామాబాదులో ఉంది. వెంకటేశ్వర హౌసింగ్ సొసైటీలో 250 చదరవు గజాల స్థలం ఉంది. దాని విలువ రూ. 2,50,000. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఓ ఇల్లు ఉంది. దాని ఖరీదు రూ. 2.9 కోట్లు ఉంటుంది. గచ్చిబౌలిలో 1.86 కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు నిర్మాణంలో ఉంది. అందులోని ఫర్నీచర్ విలువ రూ. 3 లక్షలు ఉంటుంది.

డిఎస్ సతీమణికి వేర్‌హౌసింగ్ కంపెనీలో రూ.3.8 కోట్ల విలువ చేసే ఈక్విటీ వాటా ఉంది. షంషాబాద్ సమీపంలోని ముచెంతలలో మూడు ఎకరాల స్థలం ఉంది. మేడ్చెల్‌లో 14 ఎకరాల భూమి ఉంది. ఆమె వద్ద 16 లక్షల రూపాయల విలువ చేసే బంగారం ఉంది. నిజామాబాద్‌లోని ప్రగతినగర్‌లో రూ.70 లక్షల విలువ చేసే ఇల్లు ఉంది. నిజాంపేటలో రూ.25 లక్షల ఖరీదు చేసే మరో ఇల్లు ఉంది. టోలీచౌక్‌లో 30 లక్షల రూపాయల విలువ చేసే స్థలం, హైదరాబాదులోని హైదర్‌నగర్‌లో రూ.40 లక్షల విలువ చేసే స్థలం ఉన్నాయి. ఆమె పేర రూ. 3 లక్షల విలువ చేసే ఫర్నీచర్ ఉంది.