మరోసారి కేసీఆర్ దీక్ష...? :సినీ జ్వాల తెలుగు:

Posted on

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరవధిక దీక్ష చేసే యోచనలో తెలంగాణ రాష్ట్ర సమితి  శాసనసభ్యులు ఉన్నారు. తెరాసకు చెందిన 14 మంది శాసనసభ్యులు నిరవధిక దీక్ష చేపట్టే అవకాశం ఉంది. ఈ దీక్షను ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1వ తేదీన వారు ప్రారంభించే అవకాశం ఉంది. సోమవారం పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుతో అందుబాటులో ఉన్న పార్టీ శాసనసభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ దీక్షపై చర్చ జరిగింది. అవసరమైతే ఆ తర్వాత కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టే అవకాశం ఉంది.నవంబర్ 1వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ్యులు 72 గంటల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేస్తారని తెలంగాణ రాజకీయ జెఎసి ప్రకటించింది. ఈ దీక్షలో తెరాస శాసనసభ్యులతో పాటు సిపిఐ, నాగం జనార్దన్ రెడ్డి వర్గానికి చెందిన శాసనసభ్యులు పాల్గొంటారని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ప్రకటించారు. ఈ 72 గంటల దీక్షను నిరవధికం చేయాలని తెరాస శాసనసభ్యులు ఆలోచిస్తున్నారు.

తెలంగాణ ఉద్యోగ వర్గాలు సమ్మెను వాయిదా వేసుకుంటున్న తరుణంలో తాము తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు నిరవధిక నిరాహార దీక్షలు పనిచేస్తాయని తెరాస శాసనసభ్యులు ఆలోచిస్తున్నారు.హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద దీక్షలు చేసేందుకు తెరాస శాసనసభ్యులు సమాయత్తమవుతున్నారు. ఇందుకు అనుమతి కోసం దరఖాస్తు చేయాలని అనుకుంటున్నారు. ఇందిరా పార్కు వద్ద అనుమతి ఇవ్వకపోతే ఎక్కడ దీక్షలు చేయాలనే విషయంపై కూడా ఆలోచన సాగుతోంది. కాగా, పోలవరం ప్రాజెక్టు టెండర్ల వివాదం నుంచి బయటపడేందుకే కెసిఆర్ నిరవధిక దీక్షలను తెర మీదికి తెస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శిస్తున్నారు.పోలవరం టెండర్లను దొడ్డిదోవన దక్కించుకుని కోట్లకొద్దీ డబ్బు సంచులు వెనకేసుకున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఈ పోలవరం సమస్యను పక్కదోవ పట్టించేందుకు దీక్షను తెరపైకి తెస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.