హైదరాబాద్: ఎబిఎన్-ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రా రావు మరోసారి సవాల్ విసిరారు. రాధాకృష్ణ కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటిపై చేసిన ఆరోపణలకు స్పందించకుండా వేరే విషయాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. రాధాకృష్ణ సొంత ఊరెళదామని అక్కడ తమ పార్టీ కార్యకర్తలతో ఆయన గురించి చెప్పిస్తామని అందుకు సిద్ధమా అన్నారు. జగన్ ఇంట్లో హెలిప్యాడ్, మినీ థియేటర్, సిసి కెమెరాలు ఉన్నాయని ఆరోపణలు చేశారని వాటిపై మేం చేసిన సవాల్‌కు ఇప్పటికీ కట్టుబడే ఉన్నామన్నారు. రాధాకృష్ణకు, రామోజీ రావుకు, రవి ప్రకాశ్‌కు మరో ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నామని వారు చేసిన ఆరోపణలు నిజమైతే ముందుకు రావాలన్నారు. వారిని జగన్ ఇంటికి తీసుకెళ్లి అణువణువు చూపిస్తామన్నారు.తమ సవాల్‌కు ముందుకు రాకుంటే తప్పుడు సమాచారం కారణంగా అలా ప్రసారం చేశామని తప్పు ఒప్పుకుంటే బాగుంటుందన్నారు. ఎబిఎన్ వాడిన భాష చూస్తుంటే జర్నలిజాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఉందన్నారు.