హైదరాబాద్: శాసన మండలి స్థానాన్ని మాజీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తీసుకోవడం సిగ్గు చేటని తెలంగాణ నగారా సమితి చైర్మన్, నాగర్ కర్నూల్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ కోసం 72 గంటల దీక్ష చేపట్టిన విద్యుత్ ఉద్యోగ సంఘం నేత రఘు మంగళవారం తన దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, నాగం, టిఆర్ఎస్ శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్, టీఎన్జీవో నేతలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాగం మాట్లాడారు. బుధవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి తాము రాజీనామాలు ఆమోదించమని కోరతామన్నారు. తెలంగాణ కోసమంటూ కొందరు ప్రజాప్రతినిధులు ఉత్తుత్తి రాజీనామాలు చేశారని విమర్శించారు.ఉద్యమంలో ఉద్యోగులు ఉడత పిల్లలేనని, ఐఏఎస్, ఐపిఎస్‌లు పాల్గొనడం విశేషమన్నారు. తెలంగాణలాంటి ఉద్యమం ప్రపంచంలో ఎక్కడా కనిపించదన్నారు. సకల జనుల సమ్మెకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాము ఏ రాజకీయ పార్టీలకు తొత్తులం కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమంలో ముందున్నందునే ఆ పార్టీ వెంట నడిచామన్నారు. రాజకీయ నేతలకు అండగా నిలవాలనే సమ్మెలో పాల్గొన్నామన్నారు.