పదవులు పట్టుకొని వేలాడటం సరికాదు: కోమటిరెడ్డి :సినీ జ్వాల తెలుగు:

Posted on

హైదరాబాద్: తెలంగాణ నేతలు పదవులు వదిలి గంటసేపు కూడా ఉండలేరన్న సీమాంధ్ర నేతల వ్యాఖ్యలను తెలంగాణ ప్రజాప్రతినిధులు నిజం చేస్తున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  తోటి నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాంపల్లిలోని టిఎన్జీవో భవనంలో ఏర్పాటైన ఉద్యోగుల సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. పదవులు వదిలి ఉండలేరని సీమాంధ్ర నేతలు అంటున్నప్పటికీ నేతలు పదవులు పట్టుకొని వేలాడటం సరికాదన్నారు. ఉద్యోగులను చూసి రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిన తనకు పార్టీని వదలటం ఏమంత కష్టం కాదన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వనని చెప్పిన మరుక్షణమే పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పారు.

ఉద్యోగులకు తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యమన్నారు. ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం జరిగిన సకల జనుల సమ్మెను చూపి ప్రభుత్వం ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. ఉద్యమాన్ని ఉద్యమంగానే చూడాలని హితవు పలికారు. నవంబర్ మొదటి తారీఖున లక్ష మందితో తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేస్తానని అయితే తన దీక్షతోనే కేంద్రం కదులుతుందన్న నమ్మకం లేదన్నారు. పదవులు వదిలితేనే తెలంగాణ సాధ్యమన్నారు. నవంబరు మొదటి వారంలోగా తేల్చకుంటే పార్టీ వీడతానన్నారు.