వైభవంగా జరిగిన 'శ్రీరామరాజ్యం' ఆడియో వేడుక :సినీ జ్వాల తెలుగు:

Posted on

బాలకృష్ణ, నయనతార జంటగా బాపు దర్శకత్వంలో యలమంచిలి సాయిబాబు నిర్మించిన 'శ్రీరామరాజ్యం' సినిమా ఆడియో వేడుక ఈ రోజు (ఆగష్టు 15) సాయంకాలం భద్రాచలంలో రాములవారి సన్నిధిలో వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచీ ఈ వేడుకకు విచ్చేసిన బాలకృష్ణ అశేష అభిమానులతో వేదిక ప్రాంగణమైన ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నిండిపోయింది.
             ఈ సినిమాకు సంబంధించిన స్వాగత తోరణాలతో, ఫ్లెక్సీలతో భద్రాచలం పట్టణం కొత్త శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు, అక్కినేని నాగేశ్వరరావు, బాపు, ఇళయరాజా, బాలకృష్ణ, నయనతార, శ్రీకాంత్, మురళీమోహన్, పరుచూరి గోపాలకృష్ణ, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, బాలయ్య, బోయపాటి శ్రీను, నిర్మాత సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. పంచెకట్టులో తెలుగుతనాన్ని ప్రతిబింబిస్తూ వచ్చిన బాలకృష్ణ తన ఆహార్యంతో అందర్నీ ఆకట్టుకున్నారు.
            సినిమా లోగోను అక్కినేని నాగేశ్వరరావు విడుదల చేశారు. ఆడియో సీడీని హీరో బాలకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, "రాముడు కదలాడిన పుణ్యస్థలంలో ఈ వేడుక జరగడం ఆనందంగా వుంది. నాన్నగారు నటించిన లవకుశ సినిమా పేరును దీనికి పెట్టడానికి మేం సాహసించలేదు. అయితే, ఈ సినిమా కథ మాత్రం లవకుశుల కథే. ఇందులో సంగీతానికి ఎంతో ప్రాధాన్యత వుంది. ఇళయరాజా గారు అద్భుతమైన పాటలు చేశారు. రామారావు గారు రాముడి పాత్రకు నిఘంటువు లాంటి వారు. ఆయన ఆశీస్సులు ఈ సినిమాకు వుండాలని కోరుకుంటున్నాను. బాబాయ్ అక్కినేని గారు వాల్మీకిగా నటించడం సినిమాకు బలాన్ని చేకూర్చింది" అన్నారు. ఇంకా అక్కినేని, ఇళయరాజా, శ్రీకాంత్, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు కూడా తమ అనుభూతులను పంచుకున్నారు.