తెలుగుదేశం యువ నాయకుడు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే ముందుకు వెళుతున్నారు. ఆయన కొద్ది కాలం క్రితం సీమాంద్రులపై చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.సీమాంద్ర ప్రాంతంలో తనపై ఎలాంటి అభిప్రాయం వచ్చినా,తనకు తెలంగాణలోను, తన సొంత నియోజకవర్గంలోను మంచి ఆదరణ లభించిందని ఆయన భావిస్తున్నారు. ఆయన తన మిత్రులకు ఆసక్తికరమైన విశ్లేషణ ఇస్తున్నారు.శాసనసభలో రెచ్చిపోయి గవర్నర్ ఛైర్ ను లాగిన సన్నివేశంద్వారా వారం రోజులు సస్పెండ్ అయినప్పటికీ, తెలంగాణలో తనకు విశేష ప్రచారం లభించిందని ఒకరకంగా హీరో లెక్క చూశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో కరీంనగర్ లో టిడిపి నిర్వహించిన రణభేరి సభకు వెళుతున్నప్పుడు తుపాకి చూపించానంటూ విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. తదుపరి రాజీనామా చేయడం, తదుపరి సీమాంధ్రులను తీవ్ర పదజాలంతో నిందించడం ద్వారా తిరిగా ప్రజలను ఆకట్టుకున్నానని ఆయన నమ్ముతున్నారు. అంతేకాదు. ఆయన మరో మాట కూడా చెబుతున్నారు. తెలంగాణ లో ఇప్పుడున్న తరంలో తాను నలభై ఏళ్ల వయసులో ఉన్నవాడినని, అందులోను మహబూబ్ నగర్ జిల్లాలో డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత అక్కడి సమీకరణలు మారిపోతాయని , ఇందుకు తన వయసు బాగా కలిసి వస్తుందని అంటున్నారు. అదెలాగంటే నాగం అరవై ఏళ్లుదాటిన వయసులో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించినా ఆయనకు ముఖ్యమైన స్థానం రావడం కష్టం.వేరే పార్టీలోకి వెళ్లినా అంత తేలికగా అధికారం రాదు. అదే తెలుగుదేశం పార్టీ కనుక గట్టిగా నిలబడితే తెలంగాణలో తాను ముఖ్యమంత్రి పదవి వరకు పోటీలో ఉండవచ్చని ఆయన చెబుతున్నారు. ఇప్పుడున్న తెలంగాణ నేతలలో తనకు ఉన్న పలుకుబడి , ప్రత్యేకించి ఆర్ధికంగా వనరులు సమకూర్చుకోగల శక్తి తనకు ఉన్నంతగా మిగిలినవారికి లేదని, అటు రాజకీయంగా, ఇటు ఆర్ధికంగా శక్తిమంతంగా తయారైతే ఎప్పటికైనా తెలంగాణ వస్తే ముఖ్యమంత్రి రేసులో ఉండవచ్చని ఆయన భావిస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంలో ఈ విషయాన్ని ఆయన సభలలో చెబుతుండడం కొసమెరుపు. తెలంగాణ వస్తే నాగం జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రి రేసులో ఉంటారనుకుంటే , ఇప్పుడు రేవంత్ రెడ్డి తాను ఈ విషయంలో ముందంజలోనే ఉన్నానని అంటున్నారు