'కేవీపీపైనా సీబీఐ విచారణ జరపాలి' :CineJwala Telugu:

Posted on

హైదరాబాద్‌ : సీబీఐ విచారణకు ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీపీ ముందుకు రావాలని కాంగ్రెస్‌ ఎంపీ హన్మంతరావు డిమాండ్‌ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత కేవీపీపై ఉందని అన్నారు. కేవీపీపై ఆరోపణలపై జగన్‌ పార్టీ మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. గతంలో జగన్ పై నల్లమచ్చ లేదన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కక్ష సాధింపు అనడమెంటని ప్రశ్నించారు.  కేవీపీకి తెలిసే జగన్ అక్రమాలకూ పాల్పడ్డారని, సీబీఐ విచారణకు ఆయన ముందుకు రావాలన్నారు. ప్రజాధనం దుర్వినియోగానికి జగన్ ఎంత బాధ్యుదో కేవీపీ అంటే బాధ్యుడని అన్నారు. మంత్రివర్గానికి తెలియకుండా వైఎస్, కేవీపీలే ప్రభుత్వ నిర్ణయాలన్నీ తీసుకున్నారని చెప్పారు.

మచ్చలేని నాయకుడు అయితే నిజాయితీ నిరూపించుకోవాలని అన్నారు. హైకోర్టుకు జగన్ పైన కక్ష ఎందుకు ఉంటుందన్నారు. త్వరలో అంబటి రాంబాబు వ్యవహారాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. 14ఎఫ్ రద్దుకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ దృష్టికి తీసుకు వెళతానని హెచ్చరించారు. తెలంగాణ వారిది ప్రజల ఉద్యమం అయితే సీమాంధ్రులది స్పాన్సర్ల ఉద్యమం అన్నారు. కాగా, వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రి వర్గంలోని మంత్రుల అవినీతిపైన కూడా విచారించాలని మంత్రి శంకరరావు సిబిఐకి లేఖ రాశారు. మంత్రులతోపాటు అధికారులు, సలహాదారులను కూడా విచారించాలని ఆ లేఖలో ఆయన కోరారు.