పోలవరంపై చర్చలకు మేం ఎప్పుడూ సిద్ధం: రేవంత్ రెడ్డి :సినీ జ్వాల తెలుగు:

Posted on

హైదరాబాద్: పోలవరం టెండర్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు డొంక తిరుగుడు మాటలు మాట్లాడకుండా సూటిగా సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి  సవాల్ విసిరారు. పోలవరం టెండర్లలో ష్యూ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి నమస్తే తెలంగాణ పత్రికలో పెట్టుబడులు ఉన్నాయా లేదా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాని వారు తమ అసలు రంగు బయట పడుతుందని అడ్డగోలుగా వాదిస్తున్నారన్నారు. పోలవరంపై చర్చలకు మేం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు. టిఆర్ఎస్ తప్పు ఒప్పుకుంటే చర్చలే అవసరం లేదని శిక్షే మిగిలి ఉంటుందన్నారు. వారు తమ తప్పు ఒప్పుకోకుంటే మాత్రం సాక్ష్యాధారాలతో మేం సిద్ధంగా ఉన్నామన్నారు.

పోలవరం టెండర్‌ను ష్యూ కంపెనీకి ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోట్ ఫైల్ పైన సంతకం చేశారన్నారు. చీఫ్ ఇంజనీర్ చేయాల్సిన పని సిఎం చేస్తున్నారన్నారు. టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చిత్తశుద్ధి ఉంటే తన ఆస్తులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలవరం టెండర్ల అంశాన్ని శాసనసభలో నిలదీస్తామన్నారు. పోలవరం టెండర్లలో ఎలాంటి అక్రమాలు లేకుంటే ఫైళ్లను అఖిలపక్షం ముందు పెట్టాలని మరో నేత తుమ్మల నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. అర్హుల జాబితా నుండి తొలగించిన ష్యూ కంపెనీకి టెండర్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెసు, టిఆర్ఎస్ అక్రమ సంబందఆనికి పోలవరం టెండర్లే ఉదాహరణ అని ధ్వజమెత్తారు. సిఎం క్యాంపు కార్యాలయం ప్రమేయంతోనే టెండర్లు ష్యూ కంపెనీకి వచ్చాయన్నారు. కాగా మినిట్స్ ఆధారంగా ష్యూ కంపెనీకి అర్హత లేదన్న సాక్ష్యాలను టిడిపి మీడియా ముందుంచింది.